శ్రీ మహాగణాధిపతయేనమః శ్రీ గురుభ్యోనమః భాద్రపద మాసం లో వచ్చే ముఖ్యమైన పండుగలు 1) శుక్ల తృతీయ ౼ వరాహ జయంతి ఈరోజు విష్ణువు వరాహ రూపం ధరించాడు కాబట్టి వరాహస్వామిని తలచుకుని స్వామి వారిని తెల్లని పువ్వులతో పూజించినా, భూదానము చేసినా, వెండి దానము చేసినా సకల శుభాలు కలుగుతాయి. 2)శుక్ల చతుర్థి౼ వినాయక చతుర్థి ఈరోజు గణపతి పుట్టిన రోజు మరియు గణములన్నింటికీ అధిపతి అయిన రోజు కూడా. ఈరోజు విఘ్నేశ్వరుని పూజించి, ఉండ్రాళ్ళు నైవేద్యముగా పెట్టి, వాటిని మనము కూడా ప్రసాదంగా తిని, కథ విని కథాక్షతలను శిరస్సున వేసుకోవాలి. గురువుల ద్వారా పురాణము వినాలి. 3)శుక్ల పంచమి౼ఋషి పంచమి మానవుడై పుట్టాక ఋషి ఋణం, దేవతా రుణము, పితృదేవతల రుణము తీర్చుకోవాలి. ఈ రోజు వీలున్నంతవరకు ఋషులను తలచుకోవాలి. స్నానానంతరము గణపతి ధ్యానం చేసిన తరువాత సప్తర్షులను, అత్రి, మరీచి, కౌండిన్యుడు మొదలైన ఋషులను తలచుకోవాలి. ముఖ్యముగా వ్యాసభగవానుడ్ని తలుచుకోవాలి. ఋషుల రూపంలో ఉండే గురువులను, పౌరాణికులను ఈరోజు పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలిగి ఋషిఋణం తీరుతుంది. ఈరోజు సాయంకాలం ప్రదోష సమయంలో శివాలయములో ప్రదక్షిణలు చేసి శివ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. 4)శుక్ల ద్వాదశి౼ వామనజయంతి మధ్యాహ్నం 11:45 నుండి 12:30 లోపు ద్వాదశీ ఘడియలు ఉన్న రోజున వామన జయంతి జరుపుకోవాలి. ఈరోజు విష్ణువు ఆలయంలో ప్రదక్షిణలు చేయడం, విష్ణువును చామంతి పువ్వులు, మల్లె పువ్వులు లేదా పసుపు పచ్చని పూలతో పూజించడం చాలా మంచిది. భూదానము వంటివి చేసుకునేవాళ్లు ఈరోజు భూదాన నిమిత్తము ధనం కూడా దానం చేసుకోవచ్చు. 5)మహాలయ పక్షం భాద్రపద మాసం కృష్ణ పక్షం పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు పిండ ప్రదానములు, తర్పణములు ఇవ్వటం వంటివి చేయాలి. తర్పణములు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో విడిచిపెట్టి తరువాత భోజనం చేయవచ్చు. ఈ మహాలయ పక్షములో పితృదేవతలను తలచుకొని నువ్వులు, బియ్యం వంటివి దానం చేయడం మంచిది, రోజూ ఒక్కొక్క కూరగాయ దానం చేయడం కూడా మంచిది. 6)కృష్ణపక్ష చతుర్థి౼ సంకటహర చతుర్థి రాత్రికి చతుర్థి ఉన్న రోజునే ఈ సంకటహర చతుర్థి జరుపుకోవాలి. 7)కృష్ణ పక్షం అష్టమి కృష్ణ పక్షం అష్టమి అనధ్యాయతిథి గనుక వేదములు అధ్యయనం చేయకూడదు, మంత్ర అధ్యయనం చేయకూడదు కేవలం పురాణములు మాత్రం వినాలి. 8) భాద్రపద అమావాస్య౼ మహాలయ అమావాస్య. ఒకప్పుడు ఈ చరాచర జగత్తును అంతా శివుడు తనలో లయం చేసుకున్న తిథి ఇది. ఈ రోజు పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు,తిలోదకాలు ఇవ్వడం,నువ్వులు దానం చేయడం చాలా మంచిది. (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల ప్రవచనములు మరియు కవయిత్రి శ్రీవిద్య గారు మనకందించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సందేశం) బలం గురోః ప్రవర్ధతాం