Parameswaraanugrahamపరమేశ్వరానుగ్రహం

సమర్థ సద్గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి బాల్యంలో ఒక అపూర్వ సంఘటన జరిగింది. గణపవరంలో ఉంటున్న కాలంలో తండ్రి చలపతిరావు గారు పిల్లలకు తరచుగా తన కాశీ విద్యా విశేషాలు, కాశీ నగరంలో స్నానం, ఢుంఢి విఘ్నేశ్వర, అన్నపూర్ణా విశ్వేశ్వర, విశాలాక్షీ కాలభైరవ, వేణుగోపాల దర్శన విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా ఆయన వర్ణించటంతో తాను కూడా కాశీ వెళ్లి విద్యాభ్యాసం చేసి దేవతా దర్శనం చేసుకోవాలని ఆయనకు మనస్సంకల్పం కలిగింది. తల్లిదండ్రులు తనను కాశీ తీసుకువెళ్ళే ఆర్ధిక స్థితి కలవారు కాదు. సాహసించి వెళ్ళడానికి బాల్యం. దానికి తోడు ఆర్ధిక అస్వాతంత్ర్యం. ఎవరో కాశీ, భారత దేశానికి ఉత్తర దిక్కులో ఉందని చెప్పారు. ఆ రకంగా గణపవరానికి ఉత్తరం దిక్కులో చేబ్రోలు ఉంది. చేబ్రోలు వెళితే కాశీ వెళ్ళవచ్చని ఆ చిట్టి బుఱ్ఱకు తట్టింది.

అంతే ఒకరోజు అర్థరాత్రి ఎవరికీ తెలియకుండా ఇంటిలోనుండి కేవలం కట్టుకున్న లాగూ చొక్కా తప్ప ఒక్క రూపాయి కూడా లేకుండా కాలినడకన కాశీ యాత్రకు బయలుదేరారు. తెల్లవారే సరికి చేబ్రోలు చేరుకున్నారు. అక్కడ ‘మణి’ అని పిలవబడే అరవ అయ్యరు హొటలు నడుపుతున్నాడు. అతడికి కాశీకి ఎలా వెళ్ళాలనడిగితే విజయవాడ నుండి దాదాపు 1700 కి.మీ. రైలు మార్గంగుండా ప్రయాణం చేస్తే కాశీ వెళ్ళవచ్చని తెలిసింది. అయినా మొండిగా తిండి లేకుండా విజయవాడకు ప్రయాణం కొనసాగించారు. సాయంత్రం కొంచెం చీకటి పడబోయేసమయానికి నిడమానూరు చేరుకున్నారు.

తిండి లేకపోయినా ఆగకుండా పరిగెత్తిన కారణం చేత ఆ ప్రదేశానికి చేరడంతో ఆయన శరీరం సొమ్మసిల్లనారంభించింది. తనకు తెలియకుండానే ఆయన రోడ్డు మీద చతికిల పడుతున్న సమయంలో నాలుగు చక్రాలున్న ఒకతోపుడు రిక్షా తోసుకుంటూ ప్రయాణం చేస్తున్న దంపతులు అవధాని గారిని చూచారు. వారు వీరి మొఖం మీద నీళ్ళు చల్లి, తేనె,నిమ్మరసం కలిపి గ్లాసులో పోసి ఇచ్చారు. కొంచెం ఓపిక వచ్చిన పద్మాకర్ గారు తనను సేద తీర్చిన దంపతులకేసి చూసారు. ముప్పయిఏండ్ల వయసు నిండని సొగసరి దంపతులు వారు. అద్భుతమైన తేజస్సు వారి ముఖాల్లో కనబడుతున్నది. వారితో పాటు అవధాని గారి వయస్సు వారే అయిన ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. అందులో ముందుగా స్త్రీ మూర్తి పద్మాకర్ గారిని పలకరించి పూర్తిగా వివరాలు తీసుకొన్నది. కాశీకి నడిచి వెళ్ళాలనే ఆయన సంకల్పం విని, ఆమె చిరునవ్వు నవ్వుతూ భర్త ముఖంకేసి చూసింది. అప్పుడామె భర్త, బాబూ! మీ నాన్నగారు నీకు కాశీ గురించి చాలాసార్లు చెప్పారు గదా! నీవే అంటున్నావు, కాశీఖండంలో శ్రీశైల మహిమ గిరించి అగస్త్యుడు లోపాముద్రకు వివరించాడు. ఆ ఘట్టం నువ్వు విన్నావా? అని అడిగాడు. విన్నానని బుద్దిగా తల ఊపాడాయన(తన ఇంటిలో ఎక్కడో జరిగిన విషయం ఆ దంపతులు ఎలా గ్రహించారో అప్పటికి వద్దిపర్తి వారు ఊహించలేకపోయారు. తరువాత తెలిసింది అసలు విషయం) అయితే మా మాట విను. నేను నా భార్య ఈ నా పిల్లలు కలిసి కాలి నడకన మొక్కు తీర్చుకోవటానికి వెళుతున్నాము. నువ్వు కూడా మాతో వచ్చేయి. శ్రీశైలం చూడకుండా నీవు కాశీ చూడలేవు. ఇప్పట్లో నీకు కాశీ దర్శన యోగం లేదు. అని ఎంతో ఆప్యాయంగా చెప్పిన ఆ పెద్దాయన వాక్కులో ఏ మహిమ ఉన్నదో కానీ ఆయన చెప్పిన దానిని విని ఊ కొట్టడటమే కానీ కాదని చెప్పలేకపోయారు పద్మాకర్ గారు. ఇంతలో ఆ తల్లి తిండి లేక మలమలమాడిపోయవు నేను అన్నం పెడతాను తిను అన్నది. ఎక్కడ పడితే అక్కడ తినకూడదని మడి ఆచారం పాటించాలని మా నాన్నగారు మాకు చెప్పారని అంత ఆకలిలో కూడా ఆయన సమాధానమిచ్చారు. ఆమె నవ్వుతూ మేమూ బ్రాహ్మణులమే. ఆచార వ్యవహారములున్నవారమే, అని చెప్పి అన్నం తినిపించింది. అప్పటిదాకా నడచిన శ్రమంతా ఆ భోజనం చేయటం తోటే తొలిగిపోయింది. ఆపై వారితో కలిసి ముందుగా విజయవాడలోని కనకదుర్గను దర్శించుకొని, కృష్ణాస్నానం చేసి దారిలో వారు చెప్పే పురాణకథలు వింటూ ప్రయాణం సాగించారు. ఆ దంపతులు వారి పిల్లల బట్టలే కట్టుకోటానికి ఇచ్చారు. దారిలో త్రిపురాంతకం వంటి క్షేత్రాలు దర్శిస్తూ చివరకు శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలంలో మొట్ట మొదట కనిపించేది శిఖర దర్శన ప్రాంతం.

‘’శ్రీశైల శిఖరం దృష్ట్యా, పునర్జన్మన విద్యతే” అని కాశీఖండంలో అగస్త్యుడు లోపాముద్రకు చెప్పాడు. అది విన్న లోపాముద్ర తన భర్తను ఇలా ప్రశ్నిస్తుంది. “కాశ్యాంతు మరణాన్ముక్తిహి” అని అన్నారు గదా-కాశీలో మరణిస్తేనే ముక్తి. ఇప్పుడేమో శ్రీశైలం శిఖరం దర్శిస్తే పునర్జన్మ ఉండదు అంటున్నారు, అయితే నా అనుమానం తీర్చండి.

శ్లో॥ శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే

ఇదమేవహి సత్యంచేత్ కిమర్థం కాశీరిష్యతే?”

చచ్చాక కాని మోక్షమివ్వని కాశీకంటె శ్రీశైలమే నయం కదా! ఎందుకంటే శ్రీశైల శిఖరం చూస్తేనే చాలుగదా – పునర్జన్మ ఉండదు గదా – ఇంక కాశీకి ఎందుకు వెళ్ళటం ? అప్పుడు దానికి సమాధానంగా అగస్త్యుడు ఇలా అన్నాడు. శ్రీశైలం వంటి క్షేత్రాలను దర్శిస్తే వచ్చే జన్మలోగాని, ఈ జన్మలోగాని కాశీలో మరణించే యోగం వస్తుంది. శ్రీశైలాది పవిత్ర క్షేత్రాల దర్శన ప్రభావం కాశీలో మరణించే యోగమివ్వడమే. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది. కాశీలో మరణించి మోక్షం పొందాలంటే శ్రీశైలం వంటి కొన్ని దివ్యక్షేత్రాలు చూసి తీరవలసిందే. ఇది ఈ శ్లోకంలోని అంతరార్థం.

తనని రక్షించటానికి ఆది దంపతులు గణపతి కుమారస్వాములతో దిగివచ్చారనే ఆనందం ఒకవైపు, అంతటి పురాణ దంపతులను ఇన్నాళ్ళు తనతో తిరుగుతున్నా తను గుర్తించలేకపోయాననే బాధ ఏకకాలంలో ఆయనను ముప్పిరిగొన్నాయి. వారి మధుర ప్రసంగాలు, వారు పెట్టిన మధురమైన ఆహారాలు వారి ఆప్యాయతానురాగాలు అనుక్షణం ఆయనను ఈనాటికి స్ఫురణకు వస్తూనే ఉంటాయి. “దైవం మానుషరూపేణ” అనే మాట నిజం చేస్తూ ఆది దంపతులు తనను రక్షించిన తీరును తలచుకుంటే ఆయన శరీరం ఇప్పటికీ గగుర్పొడుస్తూనే ఉంటుంది. ఆ సమయంలో అనుకోకుండా ఆయన నోటి వెంబడి ఆశువుగా కందపద్యం వెలువడింది. ఆ పద్యం వెలువడే నాటికి ఆయనకు ఛందస్సుపై బొత్తుగా అవగాహనలేదు.

కం. నా నోము పండి “దైవం

మానుషరూపేణ” యనెడి మాటయె సత్యం

బైనది, అంబాసాంబులు

పూనుకొనిరి నన్నునధ్వమున బ్రోచుటకున్॥

పులకరింతతో శిఖర దర్శన స్థానం నుండి సాక్షి గణపతి దగ్గరకు ఆయన వెళ్ళటం జరిగింది. సాక్షి గణపతి తన దగ్గరకి వచ్చిన వారి గోత్ర నామాలు తన చిట్టాలో వ్రాసికొని తరువాత ఈ విషయాన్ని యమునకి విన్నవిస్తాడని, అప్పుడు యముడు అతడిని, అనగా శ్రీశైల దర్శనం చేసుకొన్న ఆ జీవిని నరకం నుండి విముక్తి చేసి స్వర్గాది ఊర్ద్వ లోకాలకు పంపిస్తాడని స్కాందపురాణంలోని కాశీఖండము, శివ పురాణంలోని మరికొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందువల్ల అవధాని గారు సాక్షి గణపతిని దర్శించుకొని ఆపై శ్రీశైల మల్లికార్జుని,

ఆయనకు శ్రీశైలంలో అణువణువు శివలింగం గానే దర్శనమిచ్చింది. మల్లికార్జున ఆలయంలో పెద్ద రావిచెట్టు ఉంది. అక్కడ కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ సమయంలో దీర్ఘ శరీరుడు, జటాజూటధారి, త్రిశూల డమరుకాలు ధరించిన ఒక జంగమ దేవర దర్శన మిచ్చాడు. నాయనా! శ్రీశైలంలో పంచాక్షరీ మంత్రాన్ని జపం చెయ్యకుండా వట్టినే శివునిని దర్శించుకుంటావా? గురు ముఖతః పంచాక్షరీ మంత్రం స్వీకరించక పోతే శ్రీశైల యాత్ర వ్యర్థం కదా నాయనా! అని ఆ ప్రసన్న జంగమేశ్వరుడు పలకగానే మీరే ఆ మంత్రాన్ని నాకు ప్రసాదించండి స్వామీ! జపం చేసుకుంటాను అని పద్మాకర్ గారు ఆయనను వేడుకున్నారు. ఆ క్షణమే ఆ స్వామి శిరస్సున చేయి ఉంచి ప్రణవ పూర్వకంగా పంచాక్షరీ మంత్రోపదేశం చేసారు. అపూర్వమైన ఆనందం, మంత్రోపదేశం పొంది జపం చేస్తున్నపుడు కలిగింది. మంత్రోపదేశం చేసిన గురువుకి పాద నమస్కారం చేయాలని తండ్రి గారు చెప్పిన విషయం గుర్తుండటం వలన పద్మాకర్ ఆ జంగమయ్య చరణాలకు కళ్ళు మూసుకొని ప్రణమిల్లారు. కళ్ళు తెరిచే లోపు జంగమయ్య కనిపించలేదు. ఇది శ్రీశైలంలో కలిగిన రెండవ వింత అనుభూతి. తదనంతరం పంచాక్షరీ జపం చేసుకుంటూ శ్రీశైలంలో ఉన్న హాటకేశ్వర మటం దగ్గరకు వెళ్ళగానే అక్కడ మరొక జంగమయ్య కనపడి నీకు కనపడిన ఈ అనుభూతులు కాశీ దర్శనమయ్యేంతవరకూ ఎవరికీ చెప్పరాదు. ఒకవేళ చెప్పాలనుకుంటే నీకు వాక్ స్తంభన అవుతుంది. మతి పనిచేయదు. లేనిపోని అబాండాలు నెత్తినపడి అపఖ్యాతి పాలవుతావు జాగ్రత్త అని హెచ్చరించాడు. పద్మాకర్ అలాగేనని బుద్దిగా తలూపారు. శ్రీశైలం వదిలిపెట్టాలని లేదు కాని గణపవరం నుండి శ్రీశైలానికి వచ్చిన గోటేటి సూర్యనారాయణ దంపతులు ఆయనను చూచి మీ తల్లిదండ్రులు మీ కోసం బెంగపెట్టుకున్నారని చెప్పి ఆయనను జాగ్రత్తగా బస్సులో ఎక్కించి గణపవరం తిరిగి తీసుకొనివచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. జంగమయ్య మాటలను దృష్టిలో పెట్టుకొని తన అనుభూతులను ఎవరికి వివరించలేదు. కానీ ఒకనాడు కొందరు స్నేహితులు బలవంతపెట్టగా తప్పనిసరి పరిస్థితులలో ఆ రహస్యాన్ని వారికి చెప్పారు. అంతే ఆ క్షణం నుంచి 5 సంవత్సరాల పాటు మతి చలించినట్లుండి కొన్ని అబాండాలకు గురి కావలసి వచ్చింది. అయితే అదృష్టవశాత్తు మంత్రి శాస్త్రంలో ఆరి తేరిన తండ్రి గారి ఉపదేశప్రభావాల వల్ల సరియైన మార్గంలో ప్రవేశించారు. విద్యాభ్యాసం కుదుట పడింది. ఆపై గురువుగా పరమేశ్వరుడు ఆయనను ఈనాటి వరకు వెంట ఉండి, సమర్థ సద్గురువుని చేశాడు. ఇటువంటి అనేక లీలలు శ్రీశ్రీశ్రీ సమర్థసద్గురువులు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి జీవితంలో ఉన్నాయి. వాటిని త్వరలో చదువుకొని తరిద్దాము. వీటిని వ్రాసి ప్రజలకందించే భాగ్యము కలిగించిన మనందరి గురుదేవులు శ్రీశ్రీశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిపాదపద్మాలకు భక్తితో ప్రణమిల్లుతున్నాను. తక్కిన మన గురుదేవుల మహిమలు, అనుభూతులు సమగ్రంగా వెలువరించాలని నేను సంకల్పించాను. శీఘ్రములో గురు కటాక్షములో వాటిని భక్తులకు అందించగలమని విశ్వసిస్తున్నాను. శ్రీమాత, శ్రీ ప్రణవ పీటస్త ఆ పని చేయించగలరు.

expand_less